kotaiah: ఈ భూమి కోటయ్యది కాదు.. జగన్ గాలి వార్తలను ప్రచారం చేశారు: ప్రత్తిపాటి
- జగన్ చెబుతున్న భూమి కృష్ణా మాధవరావు అనే రైతుది
- కోటయ్య భూమికి, హెలీప్యాడ్ కు మధ్య 700 మీటర్ల దూరం ఉంది
- ఆరోపణలను జగన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
కొండవీడులో రైతు కోటయ్య ఆత్మహత్యపై వైసీపీ శవరాజకీయాలు చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. రైతు ఆత్మహత్యను వివాదాస్పదం చేస్తోందని అన్నారు. కోటయ్య పోస్ట్ మార్టం రిపోర్టును ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నామని... నివేదిక ఆధారంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని చెప్పారు. బొప్పాయి తోటను ధ్వంసం చేయడం వల్ల కోటయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా ఒక గాలి వార్తను ప్రచారం చేశారని దుయ్యబట్టారు.
ఈ భూమి కోటయ్యది కాదని తాము నిరూపిస్తున్నామని... ఈ భూమి కృష్ణా మాధవరావు అనే రైతుదని ప్రత్తిపాటి చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా మీడియాకు చూపించారు. కోటయ్య భూమికి, హెలీప్యాడ్ నిర్మించిన ప్రాంతానికి 700 మీటర్ల దూరం ఉందని అన్నారు. హెలీప్యాడ్ నిర్మించిన భూమి కోటయ్యదని జగన్ నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి జగన్ తప్పుకుంటారా? అని ఛాలెంజ్ చేశారు.
కోటయ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంపై డీఎస్పీ అధికారి స్థాయిలో విచారణ జరుగుతోందని ప్రత్తిపాటి చెప్పారు. అనంతరం మీడియాను కోటయ్య భూమి వద్దకు తీసుకెళ్లారు. పోలీస్ కంట్రోల్ రూమ్ కు కోటయ్య ఇచ్చిన మూడెకరాల భూమి ఇదని... ఈ భూమి పక్కన ఉన్న బొప్పాయి తోటను చూడాలని... ఎవరైనా ఒక్క కాయనైనా కోశారేమో చూసి చెప్పాలని అన్నారు. ఒక్క కాయను కోసినట్టు కూడా కనిపించడం లేదని చెప్పారు. కోటయ్య బొప్పాయి తోటలో ఒక్కరు కూడా అడుగు పెట్టలేదని చెప్పారు. జగన్ గాలి వార్తలను ప్రచారం చేస్తున్నారని. దమ్ముంటే జగన్ తన ఛాలెంజ్ ను స్వీకరించాలని అన్నారు.