Hyderabad: ప్రేమోన్మాది దాడి కేసు.. బాధితురాలు మధులిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- మధులికకు పదిహేను రోజుల పాటు చికిత్స
- ఆమె ఆరోగ్యం కుదుటపడిందన్న వైద్యులు
- ప్రేమోన్మాది భరత్ కు కఠిన శిక్ష పడాలన్న మధులిక
హైదరాబాద్ లోని బర్కత్ పురాలో ప్రేమోన్మాది భరత్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని మధులిక యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పదిహేను రోజుల చికిత్స అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ చేశారు. మధులిక ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అంగీకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలకరించిన మీడియాతో మధులిక మాట్లాడుతూ, ప్రేమోన్మాది భరత్ కు కఠిన శిక్ష పడాలని కోరింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరింది.
కాగా, మధులిక తనను ప్రేమించలేదని కసి పెంచుకున్న భరత్ ఈ నెల 6వ తేదీన ఆమెపై దాడి చేశాడు. కొబ్బరిబొండం కత్తితో ఆమెపై పదిహేనుసార్లు దాడి చేశాడు. మధులిక వైద్య చికిత్సల నిమిత్తం ఇప్పటి వరకూ పది లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షల సాయం అందింది.