kolkata: శారదా చిట్ ఫండ్ కేసు విచారణ ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ నాగేశ్వరరావు
- గతంలో బెంగాల్ సర్కార్ తరపున నాగేశ్వరరావు వాదన
- అందుకే, ఈ పిటిషన్ పై విచారణకు ఆయన విముఖత
- ఈ నెల 27కు వాయిదాపడ్డ విచారణ
శారదా చిట్ ఫండ్ కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి సీబీఐ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ కేసు దర్యాప్తునకు పశ్చిమ బెంగాల్ అధికారులు సహకరించడం లేదంటూ సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు వైదొలిగారు. ఈ కేసుకు సంబంధించి గతంలో బెంగాల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించానని, అందువల్లే, ఈ పిటిషన్ పై విచారణకు తాను విముఖత చూపుతూ వైదొలగుతున్నట్టు చెప్పారు. దీంతో, ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. కాగా, ఈ పిటిషన్ పై విచారణ నిమిత్తం ఇంతకుముందు సీజేఐ రంజన్ గొగొయ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.