Train Accident: దూసుకొస్తున్న 'వందేభారత్' రైలును చూసి.. పట్టాలపై బైక్ వదిలేసి పరుగో పరుగు!
- నుజ్జునుజ్జైన మోటార్ సైకిల్
- ప్రాణాలు దక్కించుకున్న యజమాని
- యూపీలో చోటుచేసుకున్న ఘటన
భారతదేశంలోనే అత్యంత వేగగామి ట్రైన్ గా పేరుగాంచిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ బుధవారం ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నామరూపాల్లేకుండా పోయింది. అదృష్టవశాత్తు బైక్ యజమాని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అలహాబాద్ నుంచి 42 కిలోమీటర్ల సమీపంలోని ఫఫమావు వద్ద రైల్వే ట్రాక్ పై వందేభారత్ ఎక్స్ ప్రెస్ అమితవేగంతో దూసుకొస్తుండగా, అదే సమయంలో ఓ వ్యక్తి తన బైక్ తో పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. కానీ, సెకన్ల వ్యవధిలోనే వందేభారత్ రైలు అత్యంత సమీపానికి వచ్చేయడంతో బైక్ ను పట్టాలపైనే పడేసి బతుకు జీవుడా అనుకుంటూ పక్కకి దూకేశాడు. దాంతో ఆ బైక్ రైలు ధాటికి తునాతునకలైంది.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, రైలు షెడ్యూల్ ప్రకారమే నడుస్తుందని ఉత్తర రైల్వే శాఖ ప్రతినిధి దీపక్ కుమార్ తెలియజేశారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై కొందరు రాళ్ల దాడికి యత్నించారు. యూపీలోని తుండ్లా వద్ద రైలు ప్రయాణిస్తుండగా దుండగులు రైలుపై రాళ్ల వర్షం కురిపించారు. దాదాపు రూ.97 కోట్లతో దేశీయంగా తయారైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ఆరంభం నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. తొలి పరుగులోనే సాంకేతిక కారణాలతో నిలిచిపోయి అపఖ్యాతి మూటగట్టుకుంది.