KCR: కేసీఆర్ నైజమే అంత.. హరీశ్‌ను పక్కన పెట్టడంపై విజయశాంతి
- హరీశ్‌కు మంత్రి పదవి దక్కకపోవడంపై విజయశాంతి స్పందన
- మొన్న ఆలె నరేంద్ర, నిన్న తాను, నేడు హరీశ్ అంటూ ఆవేదన
- దొరల పాలనలో పరిస్థితి మారదన్న కాంగ్రెస్ నేత
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్విట్టర్లోకి వచ్చి చురుగ్గా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి రాజకీయ పరిణామాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. తాజాగా, తెలంగాణ కేబినెట్ కూర్పులో టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీశ్‌రావుకు చోటు దక్కకపోవడంపై స్పందించారు. కేసీఆర్ నైజమే అంతన్న విజయశాంతి.. దొరల వారసత్వ పాలనలో తీరు ఎప్పటికీ మారదన్నారు. నాడు, నేడు, రేపు.. ఎప్పుడైనా ఇలానే ఉంటుందన్నారు.
టీఆర్ఎస్లో రెండో స్థానంలో ఉన్న వారి పరిస్థితి ఎప్పటికీ ఇంతేనని, మొన్న ఆలె నరేంద్ర, నిన్న తాను, నేడు హరీశ్ రావు అని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన వారిని తడిగుడ్డతో గొంతు కోయడం టీఆర్ఎస్ నాయకత్వ నైజమన్న విషయం మరోమారు రుజువైందని విజయశాంతి విమర్శించారు.