modi: సియోల్ శాంతి పురస్కారాన్ని స్వీకరించేందుకు దక్షిణకొరియా చేరుకున్న మోదీ
- సియోల్ లో మోదీకి ఘన స్వాగతం
- ఇండియా-దక్షిణకొరియా బిజినెస్ సింపోజియంలో కాసేపట్లో కీలక ప్రసంగం
- రేపు దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం దక్షిణకొరియా రాజధాని సియోల్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశంలో మోదీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇదే సందర్భంగా సియోల్ శాంతి పురస్కారాన్ని స్వీకరించనున్నారు. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ విలువలను పెంచడంలో చేసిన కృషికి గాను మోదీని దక్షిణకొరియా ఈ పురస్కారంతో సత్కరిస్తోంది.
ఇండియా-దక్షిణకొరియా బిజినెస్ సింపోజియంలో కాసేపట్లో మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. అనంతరం ఇండియా-దక్షిణకొరియా స్టార్టప్ హబ్ ను లాంచ్ చేస్తారు. భారత్ లో దక్షిణకొరియా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు, ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరిగేందుకు ఈ స్టార్టప్ హబ్ కీలక పాత్ర పోషించబోతోంది.
కింహే నగరంలో దక్షిణకొరియా అధ్యక్షుడితో మోదీ రేపు భేటీ కానున్నారు. ప్రాచీన కాలంలో అయోధ్యతో ఈ నగరానికి సంబంధాలు ఉండేవని ఒక నమ్మకం ఉంది. ఇద్దరు నేతల భేటీ సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకోనున్నాయి.