Pakistan: ఆగని పాకిస్థాన్ కవ్వింపు చర్యలు... కొనసాగుతున్న కాల్పులు
- పూంచ్ సెక్టార్లో ఈ రోజు కాల్పులు
- రాజౌరీ జిల్లాలో నిన్న తెగబడిన పాకిస్థాన్ మూకలు
- హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న దాయాది దేశం
పుల్వామా ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలను మాత్రం విడనాడడం లేదు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. నిన్న రాజౌరీ జిల్లాలో కాల్పులకు తెగబడిన పాక్ సైనికులు ఈరోజు పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద (ఎల్ఓసీ) యథేచ్ఛగా కాల్పులు జరిపారు.
2003లో ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని, సమన్వయం పాటించాలని పలుమార్లు భారత్ హెచ్చరిస్తున్నా పాకిస్థాన్ వాటిని బేఖాతరు చేస్తోందని ఓ సైనికాధికారి తెలిపారు. ఒప్పందం జరిగి దాదాపు 15 ఏళ్ల కాలంలో 2018లో అత్యధికంగా 2,936 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆ సైనికాధికారి తెలిపారు. ఈ సంఘటనల్లో మొత్తం 61 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మంది వరకు గాయపడ్డారని తెలిపారు.