Andhra Pradesh: చంద్రబాబు ఇంటికి యనమల రామకృష్ణుడు.. మేనిఫెస్టోపై చర్చలు!
- మేనిఫెస్టో రూపకల్పనపై సీఎంతో చర్చలు
- విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదన్న మంత్రి
- ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారని మండిపాటు
విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ హామీలను అమలు చేయాలని కోరితే కేంద్రం ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థలతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేయాలని వైసీపీ అధినేత జగన్, మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అమరావతిలోని చంద్రబాబు ఇంటికి యనమల ఈరోజు వెళ్లారు.
అనంతరం రాబోయే ఎన్నికల్లో టీడీపీ విడుదల చేయనున్న మేనిఫెస్టో వివరాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తండ్రి వైఎస్ అధికారంలో ఉండగా జగన్ వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని యనమల ఆరోపించారు.
కేంద్రం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యనమల హెచ్చరించారు.