Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపుపై వదంతులను నమ్మవద్దు!: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది
- ఎన్నికల నాటికి తప్పులను సరిదిద్దుతాం
- ఈ నెల 23,24న బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక క్యాంపును నిర్వహిస్తారు
- ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఓట్లను తొలగించినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన తెలిపారు. అలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఓటర్ జాబితాలో ఏదైనా అవకతవకలు ఉంటే ఎన్నికల నాటికి తప్పులన్నింటినీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడారు.
ఈ నెల 23, 24 తేదీల్లో బూత్ స్థాయి అధికారులతో రాష్ట్రమంతటా ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నామని ద్వివేది తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫారం 6,7,8తో పాటు ఓటర్ జాబితాను అధికారులు తీసుకొస్తారని అన్నారు. ఏదైనా అనుమానాలు ఉన్నవారు, ఓటు నమోదు కానివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.