Rahul Gandhi: నేడు తిరుపతిలో ఏపీ ప్రత్యేకహోదా భరోసా బస్సు యాత్ర...హాజరుకానున్న రాహుల్‌గాంధీ
- ప్రత్యేక విమానంలో రేణిగుంటకు కాంగ్రెస్ అధ్యక్షుడు
- కాలినడకన తిరుమల శ్రీవారి సన్నిధికి
- సాయంత్రం తిరుపతి బహిరంగ సభలో ప్రసంగం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు తిరుపతి వస్తున్నారు. దాదాపు రోజంతా ఇక్కడే గడపనున్నారు. పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరగనున్న ఏపీ ప్రత్యేకహోదా భరోసా బస్సు యాత్ర, అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకు ముందు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించి ఇస్తామని గత ఎన్నికల సమయంలో తిరుపతి తారకరామ మైదానంలో జరిగిన సభలో నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానం అమలుకాలేదు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొనేందుకు రాహుల్‌గాంధీ ఉదయం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అలిపిరి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకుని తిరిగి తిరుపతికి చేరుకుంటారు.
4.30 గంటలకు తిరుపతి బాలాజీ కాలనీ కూడలికి చేరుకుని మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కలిసి పట్టణ వీధుల్లో ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో భాగంగా బస్సులో తారకరామ కూడలికి చేరుకుని అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. ఐదు గంటల తర్వాత ప్రారంభమయ్యే బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.