ICICI: చందాకొచ్చర్‌ చుట్టూ బిగుస్తున్న 'వీడియోకాన్‌' ఉచ్చు... లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన సీబీఐ

  • కొచ్చర్‌ భర్త, వీడియోకాన్‌ ఎండీలకు కూడా
  • 2018లో వెలుగు చూసిన  కుంభకోణం
  • పీకల్లోతు కష్టాల్లో ఒకప్పటి శక్తిమంతమైన మహిళ

ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగానికి ఓ విధమైన చరిస్మా, ఆకర్షణ క్రియేట్‌చేసి శక్తిమంతమైన మహిళగా ఆర్థిక రంగంలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. దేశీయ రిటైల్‌ బ్యాంకింగ్‌ రంగం రూపురేఖలే మార్చిన ఘనత సొంతం చేసుకున్న ఆమె మెడకు వీడియోకాన్‌ స్కాం ఉచ్చులా మారింది.

ఈ కుంభకోణంకు సంబంధించి చందాకొచ్చర్‌తోపాటు ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ దూత్‌లపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసింది. 2008 నుంచి 2013 మధ్య వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ దూత్‌ కంపెనీలు, చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కంపెనీల మధ్య పలు ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య బదలాయింపులు జరిగినట్టు మార్చి 2018లో వెలుగు చూసింది. 2009, 2011 మధ్య కాలంలో ఆరు రుణాలుగా వీడియోకాన్ గ్రూప్ రూ. 1,875 కోట్లు పొందినట్లు గుర్తించారు.

వీడియోకాన్ కు ఎస్బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం రూ.40,000 కోట్ల రుణం మంజూరు చేయగా అందులో రూ.3,250 కోట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చింది. ఈ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఉన్న చందా కొచ్చర్ పాత్రపై సందేహాలు మొదలయ్యాయి.

ముడుపుల ఆరోపణలు రావడంతో కొచ్చర్ అక్టోబర్ లో తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రూ.1,730 కోట్ల మేర మోసం చేశారని ఆరోపిస్తూ చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ దూత్‌, న్యూపవర్ రెన్యువబుల్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ సంస్థలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News