Pakistan: వాఘా సరిహద్దులో పాకిస్థాన్ లారీలకు బ్రేక్...సరుకుల నిషేధం ఎఫెక్ట్
- పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్ సరుకులపై బ్యాన్
- ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపిన వ్యాపారులు
- అడ్వాన్స్‌లు తిరిగి చెల్లించాలని మన వ్యాపారుల డిమాండ్
పాకిస్థాన్ నుంచి వివిధ రకాల సరుకులు మోసుకుని వస్తున్న లారీలకు వాఘా సరిహద్దు వద్ద బ్రేక్ పడుతోంది. లారీల ప్రవేశానికి అనుమతించక పోవడంతో అట్టారి-వాఘా సరిహద్దులో వాహనాలు బారులు తీరుతున్నాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఆత్మాహుతి దళ సభ్యుడు దాడి చేసిన ఘటన అనంతరం పాకిస్థాన్ నుంచి సరుకుల దిగుమతిని భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం వల్ల ఇబ్బందులున్నా భారత్ ప్రభుత్వ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని వ్యాపారులు ప్రకటించారు. సరుకు దిగుమతి కోసం తాము ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి చెల్లించాలని పాక్ వ్యాపారులను కోరినట్లు కొందరు దిగుమతిదారులు తెలిపారు. ప్రస్తుతం సరిహద్దులో దాదాపు 250 లారీలు ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నాయని సమాచారం.