Andhra Pradesh: పవన్ కల్యాణ్ టీడీపీతో కలిశారంటూ వార్తలు.. ఘాటుగా స్పందించిన జనసేన అధినేత!
- జనసేనకు 25 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లు ఆఫర్
- టీడీపీ ఇచ్చిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు
- టీడీపీ, వైసీపీపై తీవ్రంగా మండిపడ్డ జనసేనాని
ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీతో జనసేన పార్టీ కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతోందని కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు 25 అసెంబ్లీ, మూడు లోక్ సభ, ఓ రాజ్యసభ సీటును టీడీపీ ఆఫర్ చేసిందని కూడా వార్తలొచ్చాయి. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, వైసీపీపై లక్ష్యంగా విరుచుకుపడ్డారు.
ఈరోజు ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ స్పందిస్తూ..‘జనసేన వైసీపీ-బీజేపీలకు భాగస్వామిగా ఉందని టీడీపీ చెబుతోంది. ఇప్పుడు టీడీపీతో మేం కలిసిపోయామని వైసీపీ చెబుతోంది. నేను రాజ్ భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కాగానే, నేను టీఆర్ఎస్-వైసీపీ మనిషినని టీడీపీ ఆరోపిస్తుంది. మనం నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అన్ని పక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది’ అని ట్వీట్ చేశారు. దీనికి స్మైలీ ఎమోజీని పవన్ కల్యాణ్ జత చేశారు.