Andhra Pradesh: జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ-వైసీపీ చేతులు కలిపాయని ఓ రాజకీయ పరిశీలకుడు చెప్పారు!: పవన్ కల్యాణ్
- ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తున్నారు
- జనసేన స్వతంత్రంగా పోటీ చేయకూడదని భావిస్తున్నారు
- నేను పోరాడే సైనికుడిని అని ఆ పార్టీలు గుర్తుంచుకోవాలి
జనసేన పేరును చెడగొట్టేందుకు టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయని ఓ రాజకీయ పరిశీలకుడు తనకు చెప్పినట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగా జనసేనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. 'వీటిపై పోరాడేందుకు నాకూ ఓ టీవీ ఛానల్, పత్రిక ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అయితే, ఎటువంటి పత్రిక, ఛానెల్ లేకుండానే బీఎస్పీ పార్టీని సుస్థిరపరచిన కాన్షీరాం బాట నాకు స్ఫూర్తి. ఇంకా చెప్పాలంటే, జన సైనికులే నాకు పత్రికలు, ఛానెల్స్ వంటివారు' అన్నారు పవన్. ఇలాంటి తప్పుడు కథనాలు ఇంకా చాలా రాబోతున్నాయనీ, ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందించిన పవన్ కల్యాణ్.. టీడీపీ, వైసీపీల వ్యవహారశైలిని దుయ్యబట్టారు.
జనసేన పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని, స్వతంత్రంగా పోటీ చేయకూడదని ఆయా రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఈ రాజకీయ యుద్ధంలో చిన్నపావు మాత్రమే కావొచ్చన్నారు. అయితే తాను పోరాడే సైనికుడిని అని ఆయా రాజకీయ పక్షాలు గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.