Sachin Tendulkar: మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్ కు అప్పనంగా రెండు పాయింట్లు ఇచ్చేస్తారా?: సచిన్ టెండూల్కర్
- వరల్డ్ కప్ లో దాయాదితో మ్యాచ్ ఆడాలి
- మంచి రికార్డును చెరిపేసుకోవద్దు
- భారత క్రికెట్ వర్గాలకు సచిన్ టెండూల్కర్ సూచన
పుల్వామా ఉగ్రదాడి కారణంగా ప్రభావితమైన అంశాల్లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలు కూడా ప్రముఖమైనవి. మరికొన్ని నెలల్లో ఇంగ్లాండ్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత్ లో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. పుల్వామా ఘటనకు నిరసనగా పాకిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడరాదని కొందరు పిలుపునిస్తుండగా, మరికొందరు మాత్రం పాకిస్థాన్ తో ఆడాలని, ఆ పోరులో దాయాదిని ఓడించి సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి ఘననివాళి అర్పించాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా దాయాదుల వరల్డ్ కప్ సమరంపై స్పందించాడు. భారత జట్టు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకుండానే అప్పనంగా రెండు పాయింట్లు అప్పగించడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశాడు. ఒకవేళ భారత్ ఆ మ్యాచ్ లో ఆడకపోతే చిరకాల ప్రత్యర్థిలాంటి పాకిస్థాన్ కు మేలు చేసినట్టు అవుతుందని అభిప్రాయపడ్డాడు.
ఇప్పటివరకు పాకిస్థాన్ ను ప్రతి వరల్డ్ కప్ లోనూ మనవాళ్లు మట్టికరిపించారని, ఈ వరల్డ్ కప్ లోనూ అదే ఊపుతో ఓడించాలని పిలుపునిచ్చాడు. అలాకాకుండా, పాకిస్థాన్ తో మ్యాచ్ ను బహిష్కరించాలనుకుంటే వ్యక్తిగతంగా ఆ నిర్ణయాన్ని భరించలేనని అన్నాడు. అయితే, దేశ ప్రయోజనాలే తనకు ప్రథమ ప్రాధాన్యం అని, ఇందులో మరో మాటకు తావులేదని స్పష్టం చేశాడు సచిన్.
ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉన్నా దానికి మనస్ఫూర్తిగా మద్ధతిస్తానని చెప్పాడు. ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న 2019 వరల్డ్ కప్ లో షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాక్ జట్లు తలడాల్సి ఉంది. పుల్వామా ఘటన నేపథ్యంలో దాయాదుల సమరంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతకుముందు, మరో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ టోర్నీలో ముందంజ వేయకుండా ఉండాలంటే భారత్ ఆ మ్యాచ్ ఆడి గెలవాలని సూచించారు.