Sabbam Hari: వడ్డించే విస్తరిలాంటి పరిస్థితిని చిందరవందర చేసుకోకూడదని ప్రజలు భావిస్తున్నారు: సబ్బం హరి
- రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చంద్రబాబుకే అనుకూలం
- నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి
- రాజధాని నిర్మాణంపై అసత్య ప్రచారం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే పనులు ఆగిపోతాయన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. ఇటీవల అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన సబ్బం హరి.. శుక్రవారం సాయంత్రం ఓ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీకే అనుకూల వాతావరణం ఉందన్న హరి.. రాజధానిలో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, దీనిని ప్రతి ఒక్కరు చూడాలని అన్నారు. రాజధాని నిర్మాణానికి గతంలో భూములు ఇవ్వబోమన్న ఉద్దండరాయపాలెం రైతులు ఇప్పుడు వందశాతం భూములు ఇచ్చారని గుర్తు చేశారు.
చంద్రబాబుపై రాష్ట్ర ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, పెద్దవాడు, గౌరవంగా మాట్లాడతాడన్న భావన కొన్ని వర్గాల్లో ఉందని హరి అన్నారు. ఆయన మాత్రమే ఈ మాత్రమైనా అభివృద్ధి చేయగలిగాడని మరికొందరు అనుకుంటున్నారని పేర్కొన్నారు. వడ్డించే విస్తరిలాంటి పరిస్థితిని చిందరవందర చేసుకోకూడదని మరో వర్గం ప్రజలు భావిస్తున్నారని హరి వివరించారు. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారని అన్నారు.