Pakistan: దిక్కు తోచని స్థితిలో దిగి రాక తప్పని పాక్.. ప్రభుత్వ అధీనంలోకి జైషే ప్రధాన కార్యాలయం!
- పుల్వామా దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
- ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన వైనం
- పంజాబ్ ప్రభుత్వ అధీనంలో జైషే కార్యాలయాలు
పుల్వామా దాడి తమ పని కాదని బుకాయిస్తూ వస్తున్న పాక్.. ఎట్టకేలకు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ఆమోదించిన తర్వాత పాక్‌లో చలనం మొదలైంది. అగ్రరాజ్యాలన్నీ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించడంతో దిక్కు తోచని పాక్ మరో మార్గం లేక జైషేపై చర్యలకు ముందుకొచ్చింది.
జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలను పంజాబ్ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. బహావల్పూర్లోని ఆ సంస్థ పాలనా పరమైన కార్యాలయంతోపాటు అదే ప్రాంగణంలో ఉన్న రెండు ఇస్లామిక్ శిక్షణ సంస్థలను కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాదు, అక్కడి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించింది. ఈ సందర్భంగా పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధరి మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్ నేతృత్వంలో జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జైషే సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.