srinagar: వేర్పాటువాదులపై ఉక్కుపాదం.. శ్రీనగర్ కు ఆకాశమార్గాన 100 కంపెనీల అదనపు బలగాలను తరలించిన కేంద్రం
- వేర్పాటువాదులను అదుపులోకి తీసుకుంటున్న బలగాలు
- రాత్రి మొత్తం కొనసాగిన దాడులు
- జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం
పుల్వామా ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్ లో కేంద్రప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తోంది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వేర్పాటువాదులకు భద్రతను తొలగించడమే కాకుండా, వారిని అదుపులోకి తీసుకుంటోంది.
తొలుత జేకేఎల్ఎఫ్ అధినేత యాసిన్ మాలిక్ ను శ్రీనగర్ లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత కశ్మీర్ లోయలో ఉన్న జమాతే ఇస్లామీ వేర్పాటువాద సంస్థ అధినేత అబ్దుల్ హమీద్ ఫయాజ్ తో పాటు ఆ సంస్థకు చెందిన డజన్ల కొద్దీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి మొత్తం దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో, కేంద్ర హోంశాఖ అత్యవసర ఆదేశాల మేరకు 100 కంపెనీల పారామిలిటరీ బలగాలను శ్రీనగర్ కు వాయుమార్గంలో తరలించారు. వీరిని జమ్ముకశ్మీర్ లోని వివిధ ప్రాంతాల్లో మోహరింపజేస్తారు.