Andhra Pradesh: బాగా చెడ్డవాడైన జగన్ కంటే తక్కువ చెడ్డవాడైన చంద్రబాబుకు అప్పట్లో పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చారు!: నాగబాబు
- పవన్, జనసేనపై గోబెల్స్ ప్రచారం జరుగుతోంది
- కానీ మాకు సోషల్ మీడియా అండగా ఉంది
- వీడియోను విడుదల చేసిన మెగాబ్రదర్
టీడీపీ, వైసీపీలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను పోరాడే సైనికుడిని అన్న విషయాన్ని ఆయా పార్టీలు గుర్తించుకోవాలని పవన్ సుతిమెత్తగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు తన సోదరుడికి మద్దతుగా ఓ వీడియోను విడుదల చేశారు. తన యూట్యూబ్ ఛానల్ ‘మై ఛానల్-నా ఇష్టం’లో మాట్లాడుతూ.. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
రెండో ప్రపంచయుద్ధం సమయంలో జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అనే నరరూప రాక్షసుడు ఉండేవాడనీ, అతని ప్రచారశాఖ మంత్రిగా గోబెల్స్ అనే మంత్రి ఉండేవాడని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. గోబెల్స్ 'హిట్లర్ అంత గొప్ప, ఇంత గొప్ప' అని చెప్పేవాడన్నారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి గోబెల్స్ లాంటి గొట్టంగాళ్లు విజయవంతమయ్యారని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు జనసేనను తొక్కేయాలనీ, జనసైనికులను మానసికంగా కుంగదీయాలని అలాంటి గోబెల్స్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు, జనసైనికులకు ప్రస్తుతం సోషల్ మీడియా అండగా ఉందన్నారు. జగన్ లాంటి చాలాచెడ్డవాడు కంటే చంద్రబాబు లాంటి కొంచెం చెడ్డవాడికి పవన్ మద్దతు ఇచ్చారనీ, మరో ఛాయిస్ అప్పట్లో లేకుండా పోయిందని నాగబాబు అన్నారు.
‘పవన్ కల్యాణ్ మీలాగా క్రిమినల్, ఫ్యాక్షనల్, స్కామ్స్, లిక్కర్, ఇసుక మాఫియాల ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి రాలేదు. స్వచ్ఛమైన పాలన అందించడానికి వస్తున్న పవన్ పై ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసినా కుదరదు. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా బలంగా ఉంది’ అని నాగబాబు అన్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.