modi: మూడున్నర గంటల తర్వాత స్పందిస్తారా? ప్రధానిగా మీ బాధ్యత ఇదేనా?: మోదీపై గల్లా జయదేవ్ ఫైర్

  • పుల్వామా దాడి వెనుక కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉంది
  • ప్రశ్నించిన వారిని దేశ వ్యతిరేకులని విమర్శిస్తున్నారు
  • పుల్వామా ఘటనను రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటోంది

పుల్వామా ఉగ్రదాడి వెనుక కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నట్టు అనిపిస్తోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. వీటి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగినట్టు ఎవరైనా అడిగితే... దేశద్రోహం అంటారని, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉగ్రదాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానిని అడిగే హక్కు ముఖ్యమంత్రి సహా ప్రతి భారతీయుడికి ఉంటుందని... వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి ఉంటుందని చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన విషయంపై స్పందించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని అన్నారు.

గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల ఉగ్రదాడి జరిగిందని... అప్పుడు మన్మోహన్ రాజీనామా చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ డిమాండ్ చేశారని గల్లా గుర్తు చేశారు. ఇప్పుడు అదే పనిని వేరేవారు చేస్తే... దేశ వ్యతిరేకులు అని ఎలా అంటారని మండిపడ్డారు. జాతీయతా భావం, దేశ భక్తి అనేవి కేవలం మోదీ, బీజేపీల హక్కు మాత్రమే కాదని అన్నారు. ప్రతి భారతీయుడు దేశభక్తి కలిగినవారేనని చెప్పారు. మోదీని ప్రశ్నించినవారి దేశభక్తిని శంకించడం మంచిది కాదని అన్నారు.

మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో ఉగ్రదాడి జరిగిందని...  అప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఒక ఛానల్ కోసం మోదీ షూటింగ్ లో పొల్గొంటున్నారని చెప్పారు. ఘటన జరిగిన తర్వాత కూడా మూడున్నర గంటలపాటు షూటింగ్ లోనే మోదీ ఉన్నారని విమర్శించారు. సాయంత్రం 6.30 గంటలకు ఉగ్రదాడిపై మోదీ స్పందించారని దుయ్యబట్టారు. ఇంత మారణహోమం జరిగినా దీనిపై ప్రధానికి కనీస సమాచారం కూడా అందలేదా? అని ప్రశ్నించారు. మన ప్రధాని ప్రపంచంలో ఎక్కడున్నా క్షణాల్లో ఆయనకు సమాచారం అందుతుందని... ఒకవేళ సమాచారం అందకపోతే, దాన్ని కూడా భద్రతా వైఫల్యంగానే పరిగణించవచ్చు కదా? అని ప్రశ్నించారు. సెల్ ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా ప్రధాని శాటిలైట్ ఫోన్ ద్వారా నిరంతరం కాంటాక్ట్ లో ఉంటారని చెప్పారు. వీటన్నింటికీ మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని... ఆ సమావేశానికి ప్రధాని ఎందుకు హాజరుకాలేదని గల్లా ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలను కలవడం మోదీకి ఇష్టం లేదా? అని అడిగారు. ఇలాంటి సున్నిత సమయంలో కూడా ప్రధాని ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పారు. పుల్వామా ఘటనను అన్ని రకాలుగా రాజకీయ లాభం కోసం బీజేపీ వాడుకుంటోందని అన్నారు. బీజేపీ నియమించిన మేఘాలయ గవర్నర్ ఇటీవల మాట్లాడుతూ, కశ్మీరీలను బహిష్కరించాలని అన్నారని మండిపడ్డారు. భారత్ లో కశ్మీర్ ఒక భాగమే కాదన్నట్టుగా వ్యాఖ్యానించారని... ఈ వ్యాఖ్యలపై కూడా మోదీ స్పందించలేదని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడినప్పుడు అతనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. మోదీకి, ఈ గవర్నర్ కు, బీజేపీ వాళ్లకు కశ్మీర్ కావాలి కానీ, కశ్మీరీలు అవసరం లేదంట అని మండిపడ్డారు.

కశ్మీరీలు, కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరుగుతున్నా మోదీ స్పందించడం లేదని గల్లా విమర్శించారు. 2019 ఎన్నికల ముందు భారత్ లో మత విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ గత నెలలోనే హెచ్చరించిందని... ఇప్పుడు అదే జరుగుతోందని చెప్పారు. ముస్లిం వ్యతిరేక ఓటు బ్యాంకు కోసం బీజేపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. దాన్ని ప్రశ్నించని చంద్రబాబును దేశ వ్యతిరేకి అంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రైమినిస్టర్ కాదు... ప్రైమ్ టైమ్ మినిస్టర్ అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కరెక్ట్ అని చెప్పారు.

  • Loading...

More Telugu News