India: బెంగళూరు ఏరో ఇండియాలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 100 కార్లు!
- కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు
- మంటలను ఆర్పుతున్న 10 ఫైరింజన్లు
- గతంలో ఇక్కడే ఢీకొన్న రెండు విమానాలు
కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షో-2019లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈరోజు విమాన ప్రదర్శన జరుగుతుండగా గేట్ నంబర్ 5 వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో 100కు పైగ కార్లు కాలి బూడిద అయ్యాయి. భారీఎత్తున మంటలు ఎగసిపడడంతో ప్రేక్షకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
కాగా, ఈ ఘటన నేపథ్యంలో ఏరో ఇండియా షోను నిర్వాహకులు నిలిపివేశారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలను అక్కడి నుంచి పంపివేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పార్కింగ్ లోని ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇంతకుముందు ఏరో ఇండియా షో రిహార్సల్స్ సందర్భంగా రెండు సూర్యకిరణ్ విమానాలు గాల్లోనే ఢీకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ పైలెట్ చనిపోగా, ఇద్దరు పైలెట్లు ప్రాణాలు దక్కించుకున్నారు.
#WATCH Nearly 80-100 cars gutted after fire broke out in dry grass at the car parking area near #AeroIndia2019 venue in Bengaluru pic.twitter.com/xGdDKm4D3V
— ANI (@ANI) February 23, 2019