relangi narasimha rao: ఆ రోజున దాసరి గారు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి చలించిపోయాను: దర్శకుడు రేలంగి నరసింహారావు
- దాసరి గారు ఫోన్ చేస్తే వెళ్లాను
- ఆయన కోప్పడటం చాలాసార్లు చూశాను
- బాధపడటం మాత్రం అదే ఫస్టు టైమ్ అనుకుంటా
హాస్యరసభరితమైన చిత్రాలను అధికంగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించిన దర్శకులలో రేలంగి నరసింహారావు ఒకరు. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకి గురువైన దాసరి నారాయణరావు గురించి ప్రస్తావించారు. "రామోజీ ఫిల్మ్ సిటీలో దాసరి గారు 'పరమవీర చక్ర' సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఆ రోజున కామెడీ సీన్స్ తీస్తున్నానని చెప్పి .. సరదాగా నన్ను రమ్మన్నారు.
దాంతో నేను అక్కడికి వెళ్లాను .. ఓ మూడు రోజులపాటు దాసరిగారితోనే వుండిపోయాను. ఒక రోజు షూటింగ్ పూర్తయిన తరువాత హోటల్ కి తిరిగొచ్చాము. ఆ రాత్రి ఆయన తన కుటుంబ విషయాలను గురించి ప్రస్తావించారు. 'ఎంతో మందికి నేను లైఫ్ ఇచ్చాను .. మా అబ్బాయికి మాత్రం లైఫ్ ఇవ్వలేకపోతున్నాను. ఇది నా లోపమా .. వాళ్ల లోపమా .. దైవం అలా రాసి పెట్టిందా? అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దాసరి గారు కోప్పడటం చాలాసార్లు చూశాను .. కానీ ఆయన బాధపడటం చూడటం మాత్రం అదే ఫస్టు టైమ్. సింహంలాంటి మనిషి అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి చలించిపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.