Chigurupati Jayaram: జయరాం హత్య కేసులో ముగిసిన నిందితుల కస్టడీ.. కొనసాగుతున్న దర్యాప్తు
- ఇప్పటి వరకు 60 మందిని విచారించిన పోలీసులు
- మరో ఐదారుగురిని విచారించనున్న అధికారులు
- పోలీసులు-రాకేశ్ రెడ్డికి మధ్య కార్మిక నాయకుడు
ప్రవాసాంధ్రుడు, ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుల కస్టడీ శనివారంతో ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ సహా మొత్తం 60 మంది అనుమానితులను విచారించిన పోలీసులు మరో ఐదారుగురిని విచారించనున్నట్టు తెలుస్తోంది. నటుడు సూర్యప్రసాద్, అతడి స్నేహితుడు కిశోర్, రౌడీషీటర్ నగేశ్, అతడి బంధువు విశాల్, శిఖా చౌదరి, ఆమె పనిమనుషులు, స్నేహితులను పోలీసులు ఇప్పటి వరకు విచారించారు.
ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి సాయపడినట్టు గుర్తించిన పోలీసు అధికారుల పాత్రపై సాంకేతికపరమైన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. రాకేశ్‌తో వ్యాపార, స్థిరాస్తి లావాదేవీలు నిర్వహించిన ఆయన స్నేహితులు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాంబాబును కూడా పోలీసులు విచారించి వివరాలు రాబట్టారు. రాకేశ్‌కు వీరందరూ పరిచయం కావడం వెనక ఓ కార్మిక నాయకుడి పాత్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆయనను కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు.