India: సాగర తీరంలో క్రికెట్ సంగ్రామం.. నేడు భారత్-ఆస్ట్రేలియా తొలి టీ20
- ముస్తాబైన విశాఖలోని పోతిన మల్లయ్యపాలెం స్టేడియం
- శుభారంభం కోసం ఇరు జట్లు ముమ్మర సాధన
- బ్యాటింగ్ స్వర్గధామంలో పరుగుల వరద పారేనా?
ప్రపంచ క్రికెట్లో మేటి జట్లుగా పేరొందిన భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 ఈరోజు విశాఖ నగరంలో జరగనుంది. మ్యాచ్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా జరిగే ఈ తొలి మ్యాచ్‌తోనే పర్యాటక దేశం టూర్ కూడా మొదలవుతుంది. బ్యాటింగ్ స్వర్గధామంగా పేరొందిన పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంను అన్ని విధాలుగా సిద్ధం చేశారు. రాత్రి ఏడుగంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
గత ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వండే మ్యాచ్‌కి ముందు వరకు టికెట్లు అమ్మాల్సి వచ్చింది. ఈమ్యాచ్‌కి మాత్రం రెండు రోజుల ముందే అన్ని ధరల టికెట్లు అమ్ముడు పోవడం మ్యాచ్‌పై అభిమానుల క్రేజ్‌కి నిదర్శనం. స్టేడియం సామర్థ్యం 27,500 కాగా, మొత్తం టికెట్లు అమ్ముడు పోవడంతో నిర్వాహకుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇటీవల స్వదేశంలో ఎదురైన చేదు అనుభవానికి ఇక్కడ విజయంతో దీటైన జవాబు చెప్పాలని పర్యాటక దేశం సిద్ధమవుతుండగా, టీ20ల్లో బలమైన జట్టుగా తన విజయపరంపరను కొనసాగించాలని భావిస్తున్న భారత్ ఇక్కడ కూడా ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని ఎదురు చూస్తోంది.
విజయమే లక్ష్యంగా ఇరు జట్లు శనివారం ముమ్మర సాధన చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే, ప్రపంచ కప్‌కు ముందు టీమ్ ఇండియాకు చివరి సన్నాహక మ్యాచ్‌లివి. ఆస్ట్రేలియాతో జరిగే టీ20, వన్డేల్లో సత్తాచాటితే ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్పులోకి అడుగు పెట్టవచ్చని ఆతిథ్య దేశం అంచనా. సొంతగడ్డ, అభిమానుల అండ ఎలాగూ కలిసి వస్తుందని భారత్ భావిస్తోంది. ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా జట్టుకు దూరమైనా కెప్టెన్ కోహ్లీ చేరికతో జట్టు సమతూకంతో ఉంది. బ్యాటింగ్ పరంగా భారత్‌కు ఎటువంటి సమస్య లేదు. ఓపెనర్లు రోహిత్, ధావన్‌లు శుభారంభాన్ని అందిస్తే ఆ తర్వాత ధోనీ, కోహ్లీ, రిషబ్‌పంత్‌లు మిగిలిన పని పూర్తి చేస్తారు. ఆల్‌రౌండర్లు విజయ్‌శంకర్, కృనాల్ పాండ్యాలు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకుంటుండడం జట్టుకు అదనపు బలం.
ఇక బౌలింగ్ విభాగంలోనూ భారత్ బలంగానే ఉంది. భువనేశ్వర్, కులదీప్‌యాదవ్‌లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చినా ఉమేష్‌యాదవ్, బుమ్రా, చాహల్, కౌల్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఆస్ట్రేలియా టూర్లో తన స్పిన్ మాయాజాలంతో కంగారులను ముప్పుతిప్పలు పెట్టిన చాహల్ సొంతగడ్డపై వారిని ఓ ‘ఆట’ ఆడుకుంటాడనడంలో సందేహం లేదు.
ఇక, పర్యాటక జట్టు భారీ అంచనాలతోనే భారత్‌లోకి అడుగుపెట్టింది. సొంత గడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడం ఒకటైతే, ప్రపంచకప్ ముందు సన్నాహక మ్యాచ్‌లుగా భావిస్తున్న ఈ టూర్లో జట్టు నిలకడగా రాణించేలా చూడడం మరొకటి. కెప్టెన్ పించ్ సహా ప్రధాన బ్యాట్స్మన్లంతా కీలక సమయాల్లో తడబడుతుండడం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ స్పిన్నర్లను ఎదుర్కోవడం ఆ జట్టుకు పెద్ద సవాల్‌గానే చెప్పాలి.
ఇరు జట్లు మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడం, బ్యాటింగ్‌కు అనుకూలమైనదని ఇక్కడి పిచ్‌కి పేరుండడంతో తొలి టీ20లో పరుగుల వరద పారుతుందని భావిస్తున్నారు. మ్యాచ్ హోరాహోరీగా సాగితే అభిమానులకు అది పండగే అని చెప్పొచ్చు. కాగా, మ్యాచ్ సజావుగా సాగేందుకు వీలుగా 1500 మంది పోలీసులతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.