Andhra Pradesh: హైదరాబాద్ లో వ్యాపారుల ఆస్తులు ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారు!: దేవినేని ఉమ ఆరోపణ
- వైసీపీ ఇన్ చార్జి బాధ్యతలను జగన్ కేటీఆర్ కు అప్పగించారు
- జగన్ ను ఏపీకి సామంత రాజుగా నియమించేందుకు కేసీఆర్ యత్నం
- వైసీపీ-టీఆర్ఎస్ జోడీకి ప్రజలు కంబైన్డ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు
వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనకు వెళుతూ పార్టీ ఇన్ చార్జి బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారని ఏపీ మంత్రి దేవినేని ఉమ సెటైర్ వేశారు. తెలుగు రాష్ట్రాలకు తాను రాజుగా ఉంటూ.. జగన్ను ఏపీకి సామంత రాజుగా నియమించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ, టీఆర్ఎస్ జోడీకి ఏపీ ప్రజలు కంబైన్డ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీకి అద్దె మైకులా బీజేపీ నేత జీవీఎల్ మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ‘మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మీ పెత్తనాలు, కుటుంబ పాలన కోసం రాష్ట్రాన్ని విడదీశారు. ఇప్పుడు మా రాష్ట్రంపై పెత్తనం చేయాలని బయలుదేరితే సహించేది లేదు’ అని స్పష్టం చేశారు. హైదరాబాద్లో వ్యాపారాలు చేసే వారిపై దాడులు చేస్తున్నారనీ, నోటీసులు ఇచ్చి ఆస్తులు ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
పోలవరాన్ని సందర్శిస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి ఎక్కడ వాస్తవాలు చెప్పాల్సి వస్తుందోనని జగన్ భయపడుతున్నారని విమర్శించారు .రూ.1500 కోట్లు ఇచ్చి ఢిల్లీని తలదన్నే రీతిలో రాజధాని నిర్మించాలని మోదీ ఎగతాళి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తెలుగు జాతిపై ఎందుకు కక్ష కట్టారని ప్రశ్నించారు.