railway: రైళ్ల వేగం పెరగనుందోచ్... ఇకపై గంటకు 120 కిలోమీటర్లు!
- ఉత్తర్వులు జారీ చేసిన రైల్వేశాఖ
- రైలు పట్టాల సామర్థ్యం పెంచడంతో నిర్ణయం
- తగ్గనున్న గమ్యం చేరే సమయం
సికింద్రాబాద్-కాజీపేట, బల్లార్ష-విజయవాడ మార్గాల్లో తిరగనున్న రైళ్ల వేగాన్ని పెంచుతూ రైల్వే శాఖ ఉత్తర్వు జారీచేసింది. ఇటీవల ఈ మార్గాల్లోని పట్టాలను అత్యధిక వేగ సామర్థ్యాన్ని అందుకునేలా చర్యలు చేపట్టడంతో వేగం పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ మార్గంలో తిరిగే రైళ్ల గరిష్ట వేగం 110 కిలోమీటర్లు కాగా ఇకపై 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకు పోనున్నాయి.
తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో ఈ మార్గాల్లో తిరిగే 20 రైళ్ల వేగం పెరగనుంది. తాజా ఉత్తర్వులు 14816/15 హిమసాగర్, 22816 బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్, 12625 కేరళ ఎక్స్‌ప్రెస్, 12193 యశ్వంతాపూర్ జబల్‌పూర్, 12269 చెన్నై- దురంతో, 12390 గయ, 22415 ఏపీ ఎక్స్‌ప్రెస్, 15016 యశ్వంతపూర్ గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ తదితరాలకు వర్తించనున్నాయి. రైళ్ల వేగం పెరగడంతో గమ్యస్థానం చేరే సమయం తగ్గనుంది.