Fire Accident: నిన్న బెంగళూరులో... నేడు చెన్నైలో!... 150 కార్లు ఆహుతి!
- కాల్ ట్యాక్సీ కంపెనీలో అగ్నిప్రమాదం
- మండుతున్న చెత్తకుప్పే ప్రమాదానికి కారణం
- ఎవరికీ ప్రమాదం జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
బెంగళూరు ఎయిర్ షోలో భారీ అగ్నిప్రమాదం జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే చెన్నై సమీపంలో అదే స్థాయిలో మరో దుర్ఘటన జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పోరూర్ లో ఆదివారం ఓ కాల్ ట్యాక్సీ కంపెనీకి చెందిన వాడుకలో లేని కార్లు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతి అయ్యాయి. మొత్తం 150 కార్ల వరకు ఈ ప్రమాదంలో అగ్నికీలలకు ఆహుతయ్యాయి.
సదరు కాల్ ట్యాక్సీ సంస్థ తన పాత కార్లను ఎస్ఆర్ఎంసీ కాలేజ్ కి చెందిన ఖాళీ స్థలంలో పార్క్ చేసింది. అయితే ఆ ప్రదేశానికి పక్కనే ఉన్న చెత్తకుప్ప మండుతుండడంతో అందులోంచి రేగిన నిప్పుకణాలు కార్లకు అంటుకుని మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు మంటలను గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.
దాంతో సమీపంలో పూనమల్లీ, ఆవడి, సెయింట్ థామస్ మౌంట్ రోడ్ ప్రాంతాల్లో ఉన్న అగ్నిమాపక శకటాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. శనివారం ఇదే తరహాలో బెంగళూరులో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో దాదాపు 300 కార్లు అగ్నికీలల్లో చిక్కుకోవడం షాక్ కలిగించింది. ఏరో ఇండియా 2019 ఎయిర్ షో జరిగిన ప్రదేశానికి అత్యంత సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.