Fire Accident: బెంగళూరు అగ్నిప్రమాదానికి సైలెన్సరే కారణమట!
- వేడెక్కిన కారు సైలెన్సర్ నుంచి మంటలు
- ప్రమాద సమయంలో బలమైన గాలులు
- కొద్ది సమయంలోనే వ్యాపించిన అగ్నికీలలు
బెంగళూరు ఎయిర్ షోలో శనివారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం ప్రభుత్వ యంత్రాంగాన్ని నివ్వెరపరిచింది. యెలహంక ఎయిర్ ఫోర్స్ కేంద్రానికి దగ్గర్లో ఎయిర్ షో నిర్వహిస్తుండగా, సమీపంలో ఉన్న కార్ పార్కింగ్ నుంచి ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దాదాపు 300 కార్ల వరకు దగ్ధమైనట్టు గుర్తించారు.
ఈ ఘటనకు అసలు కారణం ఓ కారు సైలెన్సర్ అని భావిస్తున్నారు. ఆ కారు సైలెన్సర్ బాగా వేడెక్కడంతో దాన్నుంచి మంటలు పుట్టి అవి మిగతా కార్లకు వ్యాపించాయని గుర్తించారు. ఘటన స్థలాన్ని ఆదివారం సందర్శించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో అధికారులు ఈ విషయాన్ని చెప్పారు. ఆమె వెంట భారత వాయుసేన ఉన్నతాధికారులతో పాటు అగ్నిమాపక శాఖ డైరక్టర్ జనరల్ కూడా ఉన్నారు.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బలమైన గాలులు వీస్తుండడంతో అగ్నికీలలు స్వల్ప సమయంలోనే పార్కింగ్ ఏరియాను కబళించాయని అధికారులు రక్షణ మంత్రికి వివరించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కలసికట్టుగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపారు.