ysrcp: రాష్ట్ర ఎన్నికల అధికారికి వైసీపీ నేతల ఫిర్యాదు
- చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు
- రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్న ఉమ్మారెడ్డి
- ఓట్ల తొలగింపు ద్వారా గెలవాలనుకుంటున్నారని మండిపాటు
ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని వైసీపీ నేతలు కలిశారు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో పోలీసుల సహకారంతో సర్వేలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అన్నారు.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏం తప్పు చేశారని ఆయనపై కేసు పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓట్ల తొలగింపు ద్వారా గెలవాలని టీడీపీ చూస్తోందని అన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.