cricket: ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ను నిషేధించడం అంత ఈజీ కాదు: గంగూలీ
- ఐసీసీ నిర్వహించే టోర్నీ నుంచి ఒక దేశాన్ని నిషేధించడం మామూలు విషయం కాదు
- ప్రపంచకప్ లో ఇది మరీ క్లిష్టమైన ప్రక్రియ
- పాక్ తో మనం మ్యాచ్ లు ఆడకుండా ఉండటమే బెటర్
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై మన దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, త్వరలో జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ను నిషేధించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ మేరకు ఐసీసీకి బీసీసీఐ ఓ లేఖను కూడా రాసింది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ గంగూలీ మాట్లాడుతూ, టోర్నీ నుంచి మొత్తంగా పాకిస్థాన్ ను నిషేధించడం అంత ఈజీ కాదని అన్నారు. ఐసీసీ నిర్వహించే టోర్నీల నుంచి పాక్ ను తప్పించడమనేది చాలా పెద్ద విషయమని చెప్పారు.
ఐసీసీ నిర్వహించే టోర్నీ నుంచి ఒక దేశాన్ని నిషేధించడమనేది మామూలు విషయం కాదని గంగూలీ అన్నారు. అందరూ అనుకుంటున్నంత తేలిక వ్యవహారం కాదని చెప్పారు. అందులోనూ ప్రపంచకప్ అనేది చాలా ప్రత్యేకమైన అంశమని అన్నారు. వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ను నిషేధించాలని భారత ప్రభుత్వం కానీ, బీసీసీఐ కానీ కోరుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పారు.
పాక్ తో మనం మ్యాచ్ లు ఆడకుండా ఉండటమే సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. మన దేశంలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ వరల్డ్ కప్ లో పాక్ ఆటగాళ్లకు మన ప్రభుత్వం వీసాలను నిరాకరించడం పెద్ద వివాదంగా మారిందని... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ భారత్ పై తీవ్రంగా స్పందించిందని గంగూలీ గుర్తు చేశారు.