Twitter: ట్విట్టర్ యాజమాన్యానికి క్లాస్ పీకిన కేంద్రం
- లోక్ సభ ఎన్నికల్లో పక్షపాతం చూపొద్దు
- సజావుగా సాగేలా సహకరించండి
- ట్విట్టర్ గ్లోబల్ వీపీతో మాట్లాడిన పార్లమెంటరీ కమిటీ
సామాజిక మాధ్యమం ఎంత శక్తిమంతమో అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత యావత్ ప్రపంచానికి బోధపడింది. అయితే ఫేస్ బుక్ వంటి దిగ్గజ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ నుంచి సమాచారం దుర్వినియోగం అయిందన్న ఆరోపణలు ట్రంప్ విజయాన్ని తక్కువ చేసి చూపాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఏ మూల ఎన్నికలు జరిగినా సామాజిక మాధ్యమాలపై అనుమానంగా చూస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇప్పుడు భారత్ కూడా లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు విస్పష్ట హెచ్చరికలు జారీచేసేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇప్పటికే ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్ పాలసీ హెడ్ కొలిన్ క్రోవెల్ ను భారత్ రప్పించిన కేంద్రం ఘాటుగా హెచ్చరించింది.
భారత్ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయని, ఈ సందర్భంగా ట్విట్టర్ నిష్పక్షపాతంతో, చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంటుందని క్రోవెల్ కు స్పష్టం చేసింది పార్లమెంటరీ కమిటీ. భారత్ లో జరిగే ఎన్నికల్లో నెట్వర్కింగ్ సంస్థల జోక్యాన్ని ఏమాత్రం సహించబోం అంటూ హెచ్చరించింది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంటరీ కమిటీ కొలిన్ క్రోవెల్ ను ఈమేరకు హామీ ఇవ్వాల్సిందిగా కోరింది. ఇప్పటికే కొన్ని ప్రశ్నలకు మౌఖికంగా బదులిచ్చిన ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ క్రోవెల్ మరికొన్ని ప్రశ్నలకు 10 రోజుల్లో లిఖితపూర్వకంగా జవాబులు ఇవ్వనున్నారు.
ఇక, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా దిగ్గజాల ప్రతినిధులను మార్చి 6న తమ ముందు హాజరు కావాలంటూ పార్లమెంటరీ కమిటీ కోరింది. కొన్ని దేశాల ఎన్నికలను సోషల్ మీడియా సంస్థలు అక్రమ మార్గాల్లో ప్రభావితం చేస్తున్న సంఘటనల నేపథ్యంలోనే తాము ముందస్తుగా నెట్వర్కింగ్ సైట్ల ప్రతినిధులతో మాట్లాడుతున్నామని అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.