35a article: ‘35 ఏ అధికరణం’పై పిటిషన్లు.. రేపటి నుంచి ‘సుప్రీం’లో విచారణ
- రేపటి నుంచి 28వ తేదీ వరకు మరోసారి విచారణ
- జమ్ముకశ్మీర్ కు సంబంధించిన 35 ఏ అధికరణం
- ‘35 ఏ’ను రాజ్యాంగంలో చేర్చడంపై పిటిషన్లు
జమ్ముకశ్మీర్ లోని శాశ్వత పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పించే 35 ఏ అధికరణం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో విచారణ జరిపింది. మళ్లీ రేపటి నుంచి 28వ తేదీ వరకు మరోసారి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, జమ్ముకశ్మీర్ లోని శాశ్వత పౌరులను గుర్తించి, వారికి ప్రత్యేక హక్కులు కల్పించే అధికారాన్ని రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చేందుకు 1954లో ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు.
అయితే, పార్లమెంట్ ఆమోదం పొందని ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేరుస్తున్నట్టు నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ అధికరణం చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.
ఇదిలా ఉండగా, 35 ఏ అధికరణం ద్వారా రాష్ట్ర శాసనసభ తీసుకునే ఏ నిర్ణయాన్ని సవాల్ చేసే ఆస్కారం ఉండదు. ఈ అధికరణం ద్వారా శాశ్వత పౌరులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి, స్కాలర్ షిప్స్, సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులు.