Kurnool District: కర్నూలును అమరావతిని మించిన నగరంగా తీర్చిదిద్దుతాం: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్
- జనసేన ప్రభుత్వం వస్తే ప్రతి మండలానికో డిగ్రీ కాలేజ్
- నాయకులకు కాంట్రాక్టులపైనే ఆసక్తి.. కాలేజీలపై లేదు
- విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో పవన్ కల్యాణ్
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కర్నూలు నగరానికి పూర్వ వైభవం తీసుకువస్తామని, రాజధాని అమరావతిని మించిన నగరంగా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పేరుకి అమరావతి రాజధాని అయినా, తన మనసుకి మాత్రం కర్నూలు నగరమే రాజధాని అని అన్నారు. రాయలసీమకి ఎవరు ఎంత చేశారో తెలియదని, తాను మాత్రం బాధ్యతతో పని చేసి.. ఈ సీమలోని ప్రతి చెట్టు, పుట్ట, గట్టుని కాపాడుతానని చెప్పారు. కర్నూలు యు.బి.ఆర్ కన్వెన్షన్ హాల్లో విద్యార్ధులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్ధులు చెప్పిన సమస్యలను ఆయన విన్నారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, విద్యార్ధులు చెప్పిన ప్రతి సమస్యనీ అర్థం చేసుకున్నానని, వాటిని పాలసీలుగా తీసుకువస్తానని, సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జనసేన ప్రభుత్వ హయాంలో మండలానికి ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, ప్రైమరీ హెల్త్ సెంటర్లు బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదోని వాసులు ఎప్పటి నుంచో డిగ్రీ కాలేజీ కోసం పోరాటం చేస్తుంటే, రాయలసీమ వాసిగా జగన్మోహన్రెడ్డి ఎందుకు స్పందించరు? అని ప్రశ్నించారు. చట్టసభల్లో అడుగుపెట్టకుండానే తాను ఇన్ని సమస్యలని బయటకు తీసుకురాగలిగినప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన ఎందుకు చేయలేరు? ఇక్కడ నాయకులకి కాంట్రాక్టుల మీద ఉన్న ఆసక్తి కాలేజీలు ఏర్పాటు చేయడంపై లేదని, అందరికీ ఉచిత విద్య జనసేన పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందిస్తామని, ఫిన్‌ల్యాండ్ తరహా విద్యా విధానాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కర్నూలులో రాజకీయ నాయకులందరికీ కాలేజీలు ఉన్నాయని, వాటి కోసం ప్రభుత్వ పాఠశాలల్ని చంపేశారని, ఇలాంటి విధానాలని ఢిల్లీలో 'ఆప్' ప్రభుత్వం మార్చి చూపించిందని ప్రశంసించారు.
అందరికీ ఉచిత విద్య అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని, ఎన్నో విలువైన మాటలు వీధి బడుల్లోనే తాను నేర్చుకున్నానని, విద్యార్థుల జేబు నుంచి డబ్బు ఖర్చు కాకుండా అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలని, ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్ పాస్‌లు ఇవ్వాలని, తినే తిండి సహా అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించాలని అన్నారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయల దోపిడి జరుగుతున్నప్పుడు అది ఎందుకు సాధ్యపడదని, తన ముందుంచిన ప్రతి సమస్యనీ జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్టు చెప్పారు. ప్రతి సమస్యకీ పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేస్తానని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో చేయలేకపోయామో వివరించి.. క్షమాపణ చెబుతానని పవన్ కల్యాణ్ అన్నారు.