Srisailam: అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలు!
- పురవీధుల్లో గ్రామోత్సవంతో వేడుకలు మొదలు
- వేలాదిగా తరలివచ్చిన శివస్వాములు
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
కర్నూలు జిల్లాలో కొలువైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవంతో వేడుకలు ప్రారంభం కాగా, నేడు రెండోరోజు బృంగి వాహనంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం భక్తులతో నిండిపోయింది. వేలాదిగా శివస్వాములు మల్లన్న దర్శనానికి వచ్చారు. దేవాలయం ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతుండగా, దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది.
పాతాళగంగ వద్ద భక్తుల పుణ్యస్నానాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం చుట్టుపక్కల దర్శనీయ స్థలాలుగా ఉన్న శిఖరం, పాలధార, పంచధార, సాక్షి గణపతి ఆలయాల్లోనూ భక్తులు క్యూ కట్టారు. శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. గుంటూరు, ఒంగోలు, విజయవాడ, కర్నూలు ప్రాంతాలతో పాటు మహబూబ్ నగర్, హైదరాబాద్ నుంచి రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతామని అధికారులు వెల్లడించారు.