India: 'గో ఎహెడ్' అన్న మోదీ... పని పూర్తి చేసి వచ్చిన ఎయిర్ ఫోర్స్!
- దాడులకు ముందు త్రివిధ దళాల అధినేతలతో సమావేశం
- సోమవారం సాయంత్రం నుంచే చర్చలు
- మూడు ప్రాంతాల్లోని శిబిరాల ధ్వంసం
ఈ తెల్లవారుజామున పీఓకేలో జరిగిన భారత లక్షిత దాడులకు ముందు నిన్న సాయంత్రం నుంచి త్రివిధ దళాల అధినేతలు, మోదీ, రక్షణ శాఖ ఉన్నతాధికారుల మధ్య ఎడతెగని చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను శాటిలైట్ల ద్వారా గుర్తించిన సైన్యం, వాటి గురించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, సాధారణ ప్రజలకు ఎటువంటి హానీ కలుగకుండా దాడులను పూర్తి చేసుకుని రావాలని ఈ చర్చల్లో నిర్ణయించినట్టు సమాచారం.
గతంలో మోదీ సర్కారు నిర్వహించిన తొలి సర్జికల్ స్ట్రయిక్స్ లో భాగంగా సైన్యాన్ని పీఓకేలోకి పంపగా, ఈ దఫా దాదాపు 500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న బాలాకోట్ (హఫీజ్ సయీద్ సొంత ప్రాంతం), చకోటీ, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని శిబిరాలను గుర్తించి, వాటి లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్లాన్ వేసి, దాని బ్లూ ప్రింట్ ను నరేంద్ర మోదీ ముందు బారత వాయుసేన ఉంచినట్టు తెలుస్తోంది.
మొత్తం దాడుల పని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి కావాలని, సాధ్యమైనంత ఎక్కువ మంది ఉగ్రవాదులను హతమార్చాలన్న నరేంద్ర మోదీ, గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 'గో ఎహెడ్' అని చెప్పగానే, అవే ఆదేశాలు సరిహద్దుల్లోని ఐఏఎఫ్ బేస్ లలో ఉన్న హెడ్ లకు చేరవేయబడ్డాయి. అన్ని విమానాలూ ఒకేసారి బయలుదేరాలని, టార్గెట్ ను చేరుకున్న తరువాత, వాటిని నాశనం చేసి వెంటనే వెనుదిరిగి వచ్చేయాలని, ఒక్క విమానానికి కూడా నష్టం కలుగకుండా పని పూర్తి చేసిరావాలని మోదీ ప్రత్యేక సలహాలు ఇవ్వగా, వాటిని ఐఏఎఫ్ ఫైటర్లు తు.చ. తప్పకుండా పాటించారు.