indian air force: 90 సెకన్లలోనే ఆపరేషన్ పూర్తి... 300 మంది టెర్రరిస్టులు ఖతం.. భారత వాయుసేన పవర్ ఇది!
- పక్కా ప్లాన్ తో దాడి చేసిన భారత్
- జైషే మొహమ్మద్ కీలక స్థావరం ధ్వంసం
- పర్వత ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఉన్న స్థావరం
పాకిస్థాన్ లోని ఉగ్రతండాలపై భారత వాయుసేన జరిపిన ఏరియల్ స్ట్రైక్స్ కు సంబంధించి పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నియంత్రణరేఖనే కాకుండా, అంతర్జాతీయ సరిహద్దును సైతం దాటి వెళ్లిన మన యుద్ధ విమానాలు ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేశాయి. భారత అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం అంతర్జాతీయ సరిహద్దుకు అవతల 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాకోట్ లోని జైషే మొహమ్మద్ స్థావరంపై మన వాయుసేన ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ స్థావరం పర్వత ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉంది. పక్కా ప్లాన్ తో అక్కడకు వెళ్లిన మన మిరాజ్ జెట్ ఫైటర్లు కేవలం ఒకటిన్నర నిమిషంలో ఆపరేషన్ పూర్తి చేశాయి. ఈ దాడిలో దాదాపు 300 మంది ముష్కరులు హతమయ్యారు. ఈ టెర్రర్ క్యాంప్ జైషే మొహమ్మద్ కు అత్యంత కీలకమైనది. జైషే చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు యూసుఫ్ అజార్ ఈ క్యాంప్ ను నిర్వహిస్తున్నాడు.
ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంతో లక్ష్యాన్ని గుర్తించామని, ఈ క్యాంప్ జనావాసాలకు చాలా దూరంగా ఉందని అధికారులు తెలిపారు. భారత్ పై మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే మొహమ్మద్ కుట్ర పన్నిందని... ఈ క్యాంపులో ఆత్మాహుతిదళ సభ్యలకు ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు. వాయుసేన దాడులలో జైషే మొహమ్మద్ సీనియర్ కమాండర్లు, టెర్రరిస్టులు, ట్రైనీలు ఇతర జిహాదీలు భారీ ఎత్తున చనిపోయారని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. మరోవైపు, ఈ దాడుల్లో లేజర్ గైడెడ్ బాంబులను వినియోగించారు.