sensex: మార్కెట్లపై ప్రభావం చూపిన యుద్ధ భయాందోళనలు.. సెన్సెక్స్ ఢమాల్
- అప్రమత్తంగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు
- ఒకానొక సమయంలో 499 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశం ఉందంటున్న అనలిస్టులు
పాకిస్థాన్ భూభాగంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేయడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 499 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్న మార్కెట్లు చివరి గంటలో మళ్లీ పతనమయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 240 పాయింట్లు పతనమై 35,973కు పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 10,835 వద్ద స్థిరపడింది.
హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు నష్టపోయాయి. టాటా మోటార్స్, కోల్ ఇండియా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో తదితర కంపెనీలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
మరోవైపు, మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుల్లో కొనసాగే ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. బోర్డర్ లో ఏం జరగనుందో వేచి చూడాలని అన్నారు.