ayodhya: ‘అయోధ్య’ స్థల వివాదం కేసు.. మధ్యవర్తి నియామకంపై మార్చి 5న నిర్ణయం: ‘సుప్రీం’ ధర్మాసనం

  • ఈ వివాదం మధ్యవర్తి ద్వారా పరిష్కారమవుతుందంటే నియమిస్తాం
  • అందుకు సిద్ధంగా ఉన్నాం
  • సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం నిమిత్తం మధ్యవర్తిని నియమించే అంశంపై మార్చి 5న ఓ నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్.ఎ. బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై ఈరోజు విచారణ ప్రారంభించింది.

న్యాయస్థానం నియమించే మధ్యవర్తి ద్వారా ఈ వివాదం పరిష్కారానికి ఒక్క శాతం అవకాశమున్నా.. నియమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. మధ్యవర్తిని నియమించాలా? వద్దా? అన్న అంశంపై మార్చి 5న నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా కొన సాగుతున్న ఈ వివాదాన్ని సీరియస్ గా తీసుకోరా? అని మధ్యవర్తి ఏర్పాటు వద్దని వ్యతిరేకిస్తున్న కొన్ని ముస్లిం, హిందూ పార్టీలను ధర్మాసనం ప్రశ్నించింది.

ఈ వివాదానికి సంబంధించి స్థలం హక్కుల గురించి మాత్రమే తాము నిర్ణయం తీసుకోగలమని స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలను కక్షిదారులకు ఆరు వారాల్లోగా సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అన్ని పార్టీలు ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, తమ అభ్యంతరాలను తెలియజేయాలని ధర్మాసనం తెలిపింది.ఈ పత్రాల పరిశీలనకు ఎంత సమయం కావాలని ముస్లిం పార్టీలను ధర్మాసనం ప్రశ్నించగా, 8 నుంచి 12 వారాలు కావాలని వారి తరపున న్యాయవాది ధావన్ కోరారు. ఎనిమిది వారాల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని, ఈలోగా కక్షిదారులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమకు తెలియజేయవచ్చని ధర్మాసనం చెప్పింది.

  • Loading...

More Telugu News