India: స్వీయ రక్షణ కోసం దాడులు చేసే హక్కు భారత్ కు ఉంది: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
- ఐక్యరాజ్యసమితి ఆర్టికల్ 51లో ఈ విషయం ఉంది
- ఇలాంటి ఘటన జరుగుతుందనుకున్నా
- ‘లష్కరే తోయిబా’ కాదు అది ‘లష్కరే సైతాన్’
పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాల దాడిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఏదైనా దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపడంలో విఫలమైనప్పుడు, బాధిత దేశం తనను తాను రక్షించుకునేందుకు దాడి చేసే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించారు. స్వీయ రక్షణ కోసం దాడులు చేసే హక్కు భారత్ కు ఉందని, ఐక్యరాజ్యసమితి ఆర్టికల్ 51లోనే ఈ విషయం ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. వాస్తవానికి పుల్వామా ఘటన తర్వాత ఇటువంటిదేదో జరుగుతుందని తాను భావించినట్టు చెప్పారు. ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’, మసూద్ అజర్ పై ప్రభుత్వం దాడులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘లష్కరే తోయిబా’ను ‘లష్కరే సైతాన్’ గా అభివర్ణించారు. ఈ దాడులకు వీడియో సాక్ష్యాలు కావాలా? అనే ప్రశ్నకు అసదుద్దీన్ స్పందిస్తూ, నాడు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినప్పుడు కూడా తాము ప్రశ్నించలేదని, ఇప్పడు కూడా అంతేనని స్పష్టం చేశారు.