Andhra Pradesh: చూద్దాం.. పవన్ కల్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తాడో: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య
- ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది
- నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు
- ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పలేను
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చాలాకాలం తర్వాత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని తానైతే చెప్పలేనన్నారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఒత్తిడి భరించలేకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను తప్పితే గవర్నర్ పదవి ఇస్తారని ఆశపెట్టి మాత్రం తనతో రాజీనామా చేయించారన్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్నారు.
తనకంటూ ప్రత్యేకంగా శిష్యులు ఎవరూ లేరన్న రోశయ్య తన కుటుంబం నుంచి కూడా రాజకీయాల్లోకి ఎవరూ రాలేదని స్పష్టం చేశారు. తాను పదవిలో ఉన్నప్పుడు విషయాల ప్రాతిపదికనే పనులు చేసేవాడిని తప్పితే తనది పలానా కులమని ఆ కులం వాళ్లకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ఒత్తిడి భరించలేకే వేరే ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని అడిగానని, అందుకు వారు అంగీకరించారని రోశయ్య వివరించారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేమన్న రోశయ్య.. కొత్త కుర్రాడు పవన్ మాత్రం ఏదో తపనతో తన ప్రయత్నం తాను చేస్తున్నాడని, ఈ విషయంలో అతడు ఎంతవరకు విజయవంతమవుతాడో వేచి చూడాల్సిందేనని రోశయ్య అన్నారు.