Ravali: వరంగల్ లో దారుణం... రవళిపై తొలుత యాసిడ్ దాడి... ఆపై పెట్రోల్ పోసి అంటించిన అన్వేష్!
- 90 శాతం కాలిన గాయాలతో రవళి పరిస్థితి విషమం
- ఎంజీఎం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య రవళి
- అన్వేష్ ను ఎన్ కౌంటర్ చేయాలని పోలీసులతో విద్యార్థుల వాగ్వాదం
వరంగల్ నగరంలో ఈ ఉదయం తీవ్ర కలకలం రేపిన యాసిడ్ దాడిపై మరిన్ని వివరాలు అందుతున్నాయి. కాలేజీలో బీకామ్ మూడవ సంవత్సరం చదువుతున్న రవళి అనే యువతిపై, సాయి అన్వేష్ అనే యువకుడు అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి బయలుదేరిన ఆమె, తరగతి గదికి చేరుకోగానే, ఆమెతో వాగ్వాదానికి దిగి, ఓ మూలకు నెట్టేసి, తొలుత యాసిడ్ పోసి, ఆపై తన వెంట తెచ్చుకున్న పెట్రోలును చల్లి నిప్పింటించాడు. ఈ ఘటనలో రవతి శరీరం 90 శాతం గాయాలతో నిండిపోగా, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రవళిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
సాయి అన్వేష్ ది వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామం కాగా, సంగెం మండలం రామచంద్రపురానికి చెందిన రవళి, హన్మకొండ రామ్ నగర్ కిషన్ పురాలో హాస్టల్ లో ఉంటూ కాలేజీలో చదువుకుంటోంది. వీరిద్దరి మధ్యా గతంలో ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తుండగా, అన్వేష్ ప్రవర్తన నచ్చక గత కొంతకాలంగా రవళి అతన్ని దూరం పెట్టింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 'ఏపీ 36 ఎల్ 4835' నంబర్ గల బైక్ పై వచ్చిన సాయి అన్వేష్, ఆమెపై దాడికి దిగాడు. అడ్డు చెప్పబోయిన తోటి విద్యార్థులను బెదిరించాడు. దాడి తరువాత అన్వేష్ ను పట్టుకున్న తోటి విద్యార్థులు, అతన్ని పోలీసులకు అప్పగించారు.
ఈ సందర్భంగా గతంలో వరంగల్ లో యాసిడ్ దాడి చేసిన యువకుడిని ఎన్ కౌంటర్ చేసినట్టే, అన్వేష్ ను ఎన్ కౌంటర్ చేయాలని విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అన్వేష్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చిన పోలీసులు, విద్యార్థులను శాంతింపజేశారు. ఈ ఘటనతో కాలేజీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.