India: నేటి ఉదయం కశ్మీర్ లో ఇద్దరు జైషే ఉగ్రవాదుల కాల్చివేత!
- భారత్ లోకి చొరబడ్డ జైషే ఉగ్రవాదులు
- పక్కా సమాచారంతో మట్టుబెట్టిన భద్రతాబలగాలు
- ఉగ్రవాదుల ఏరివేతకు కొనసాగుతున్న ఆపరేషన్
పాకిస్తాన్ కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో నిన్న వైమానిక దాడులు చేసిన భారత్ దాదాపు 350 మంది ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఒక్క రోజు కూడా కాకముందే జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలు నేడు ఇద్దరు జైషే ఉగ్రవాదులను కాల్చిచంపాయి.
షోపియాన్ జిల్లాలోని మిమెందార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతాబలగాలకు ఈరోజు ఉదయం పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అయితే బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు.
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపామని తెలిపారు. వీరిద్దరూ నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ సభ్యులని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వీరిద్దరూ భారత్ లోకి ప్రవేశించారన్నారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరింత మంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో ఆపరేషన్ ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.