GoAir: గో ఎయిర్ విమానంలో తీవ్ర కుదుపులు... ఇద్దరికి గాయాలు!
- భువనేశ్వర్ నుంచి కోల్ కతాకు బయలుదేరిన గో ఎయిర్ విమానం
- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్న ప్రయాణికులు
- గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స
భువనేశ్వర్ నుంచి కోల్ కతాకు బయలుదేరిన గో ఎయిర్ విమానం, వాతావరణం అల్లకల్లోలంగా ఉండటంతో, తీవ్ర ఒడిదుడుకులకు గురికాగా, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. భువనేశ్వర్ నుంచి 'జీ8 761' సర్వీసు టేకాఫ్ తీసుకుంది. ఆపై కాసేపటికే విమానం తీవ్ర కుదుపులకు గురైంది.
ఈ ఘటనలో విమానం సిబ్బందిలోని ఇద్దరికి గాయాలు అయ్యాయని, ప్రయాణికులంతా క్షేమమేనని, కోల్ కతాలో విమానం సేఫ్ ల్యాండింగ్ అయిందని గోఎయిర్ ప్రకటించింది. గత రెండు రోజులుగా తీర ప్రాంత వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, ఈ కారణంగానే టర్బులెన్స్ ఏర్పడిందని తెలిపింది. విమానానికి కూడా ఎటువంటి ప్రమాదమూ జరగలేదని, కోల్ కతాలో విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే తదుపరి సర్వీస్ ను నడిపించామని ప్రకటించింది. గాయపడిన సిబ్బందికి కోల్ కతా ఎయిర్ పోర్టులో చికిత్స చేయించామని పేర్కొంది