mumbai: సర్జికల్ స్ట్రయిక్స్ ఎఫెక్ట్ : ఆర్థిక రాజధాని ముంబయిలో భద్రత కట్టుదిట్టం
- విమానాశ్రయం, రైల్వేస్టేషన్, ఇతర రద్దీ ప్రాంతాల్లో సీసీ టీవీలతో నిఘా పెంపు
- పాఠశాలలు, కంపెనీలకు మార్గదర్శకాలు జారీ
- త్రివిధ దళాధిపతులతో సమావేశం కానున్న రక్షణ మంత్రి
సర్జికల్ స్ట్రయిక్స్, సరిహద్దులో యుద్ధమేఘాలు, పాక్ కవ్వింపు చర్యల నేపధ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడుల్లో పలుమార్లు ఈ మహానగరం గాయపడింది. నెత్తుటిఏర్లు పారగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్ర స్థావరాలపై భారత్ దాడుల నేపథ్యంలో అక్కసుతో ఉన్న పాక్ ఏదైనా దారుణానికి ఒడిగడుతుందేమో అన్న అనుమానంతో నిఘా పటిష్టం చేశారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి నిఘా పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలలు, పరిశ్రమలకు ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
ప్రజలు ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానితులు కనిపిస్తే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ త్రివిధ దళాధిపతులతో ఈరోజు సమావేశం అవుతున్నారు. వారు తీసుకువచ్చిన ప్రతిపాదనలపై ఆమె చర్చించనున్నారు.