India: పాకిస్థాన్ పై సర్జికల్ దాడుల్లో హైదరాబాద్ పాత్ర.. పైలెట్లు అందరూ శిక్షణ పొందింది ఇక్కడే!

  • దుండిగల్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ
  • మూడు దశల్లో సాగే ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్
  • 1967, అక్టోబర్ లో ప్రారంభమైన అకాడమీ

భారత్ లో అశాంతిని రాజేస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులను వాయుసేన(ఐఏఎఫ్) చావుదెబ్బ తీసిన సంగతి తెలిసిందే. నిన్న తెల్లవారుజామున పాక్ లోని బాలాకోట్ లో చేసిన సర్జికల్ దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ సర్జికల్ దాడుల్లో పాల్గొన్న పైలెట్లు అందరూ హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్నవారేనని తేలింది. ఈ పైలెట్లు అందరూ హైదరాబాద్ లోని హకీంపేటలో ఉన్న దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పొందారని ఓ సీనియర్ ఐఏఎఫ్ అధికారి తెలిపారు.

ఐఏఎఫ్ లో చేరే పైలెట్లకు తొలుత బేసిక్, ఆ తర్వాత అప్లయిడ్ ట్రైనింగ్ ను దుండిగల్ అకాడమీలోనే అందిస్తారని వెల్లడించారు. అనంతరం ఆపరేషనల్ ట్రైనింగ్ ను పఠాన్ కోట్, ఆదంపూర్ ఎయిర్ బేస్ లలో ఇస్తారని పేర్కొన్నారు. ఈ పైలెట్లకు తొలుత 6 నెలల పాటు ఫ్రీ-ఫ్లయింగ్ శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం మాడ్యులేటర్ ద్వారా విమానం నడపడంలో మెలకువలు నేర్చుకుంటారని అన్నారు.

చివరగా కిరణ్ మార్క్-1, కిరణ్ మార్క్-2 ఫైటర్ జెట్లతో శిక్షణ పొందుతారని తెలిపారు. 1967, అక్టోబర్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీని ప్రారంభించారు. 7 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అకాడమీ నుంచి వందలాది మంది యువతీయువకులు శిక్షణ పొందారు.

  • Loading...

More Telugu News