USA: వియత్నాం వెళుతూ చైనాలో రైలు ఆపి సిగరెట్ తాగిన కిమ్ జోంగ్ ఉన్
- ట్రంప్ తో భేటీకి కొరియా నియంత రైలు ప్రయాణం
- చైనా రైల్వే స్టేషన్ లో జర్నీ బ్రేక్
- సోదరి చేతిలో యాష్ ట్రే
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చల కోసం తన సొంత లగ్జరీ రైలులో చైనా మీదుగా వియత్నాం చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన సిగరెట్ తాగడం కోసం చైనాలోని ఓ రైల్వే స్టేషన్ లో తన రైలును ఆపేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన సన్నిహితులు వెంటరాగా రైల్వే స్టేషన్ లో హుషారుగా దమ్ము కొట్టారు. ఈ సమయంలో కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ యాష్ ట్రే పట్టుకుని కనిపించింది. అంతేకాదు, ఉత్తర కొరియా అధికార పక్షానికి చెందిన హ్యోన్ సాంగ్ వోల్ కూడా ఆయన పక్కనే దర్శనమిచ్చారు. సాధారణంగా దేశాధినేతలు విమాన ప్రయాణాలకు మొగ్గుచూపుతారు. అందుకు భిన్నంగా కిమ్ జోంగ్ ఉన్న దాదాపు 70 గంటల పాటు రైలులో ప్రయాణించి వియత్నాం చేరుకున్నారు.
కిమ్ చైన్ స్మోకర్ గా పేరుగాంచారు. ఆయన ఏలుబడిలో ఉన్న ఉత్తర కొరియాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ధూమపాన వ్యతిరేక ఉద్యమం నడుస్తున్న తరుణంలో కూడా ఆయన సిగరెట్ తాగుతూ దర్శనమిస్తుంటారు. అంతేకాదు, ద్రవరూప ఇంధనంతో నడిచే ఖండాంతర క్షిపణి ప్రయోగవేదిక వద్ద కూడా చేతిలో విలాసంగా సిగరెట్ పట్టుకుని నిలుచుంటారు. ఓవైపు అదెక్కడ ఇంధనానికి అంటుకుని భగ్గుమంటుందోనని శాస్త్రవేత్తలంతా హడలి చస్తుంటే కిమ్ మాత్రం చిద్విలాసంగా పొగత్రాగుతూ మైమరిచిపోయిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.