Cricket: రెండో టి20లోనూ భారత్ కు తప్పని ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం
- గ్లెన్ మ్యాక్స్ వెల్ సూపర్ సెంచరీ
- 7 వికెట్ల తేడాతో ఆసీస్ విక్టరీ
- 2-0తో సిరీస్ వశం
టీమిండియా సొంతగడ్డపై తడబాటుకు గురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం బెంగళూరులో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. రాహుల్ 47, కోహ్లీ 72, ధోనీ 40 పరుగులు చేశారు.
అనంతరం, లక్ష్యఛేదనలో ఆసీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే విజయభేరి మోగించింది. సెంచరీ హీరో గ్లెన్ మ్యాక్స్ వెల్ సిక్స్, ఫోర్ తో మ్యాచ్ ను ముగించాడు. ఆసీస్ 19.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ 55 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. హ్యాండ్స్ కోంబ్ 20 పరుగులు సాధించాడు. అంతకుముందు ఓపెనర్ డార్సీ షార్ట్ 40 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో విజయ్ శంకర్ కు రెండు వికెట్లు దక్కాయి. వైజాగ్ లో జరిగిన తొలి టి20లో కూడా ఆసీస్ జట్టే నెగ్గింది. దాంతో రెండు టి20ల సిరీస్ ను ఆసీస్ 2-0తో గెలుచుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ మార్చి 2 నుంచి జరగనుంది. తొలి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది.