Andhra Pradesh: తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు... వివరాలు!
- ఎమ్మెల్యేల కోటాలో యనమల, దువ్వారపు
- గవర్నర్ కోటాలో శివనాధ్ రెడ్డి, శమంతకమణి
- స్థానిక సంస్థల కోటాలో బుద్ధా నాగ జగదీశ్వరరావు
త్వరలో జరగనున్న ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఏడుగురు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు, గవర్నర్ కోటాలో శివనాధ్ రెడ్డి, శమంతకమణిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక స్థానిక సంస్థల కోటా నుంచి విశాఖపట్నానికి చెందిన బుద్ధా నాగ జగదీశ్వరరావు పేరును ఆయన ఖరారు చేశారు. దీంతో యనమల, శమంతకమణిలకు ఎమ్మెల్సీలుగా కొనసాగే అవకాశం రెండోసారి కల్పించినట్లయింది.
ఏడుగురిలో సామాజిక సమతూకాన్ని పాటించిన చంద్రబాబు, నలుగురు బీసీలకు, రెడ్డి, కాపు, ఎస్సీ, మాదిగ వర్గాల నుంచి ఒక్కొక్కరికీ స్థానం కల్పించారు. ఇక బీసీల్లో రజక, గవర, యాదవ, బోయ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించినట్లయింది. రాయలసీమ, మహిళ, మాదిగ కోటాలో శమంతకమణి పేరు ఖరారైంది. సోమిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఆమె ఎంపికయ్యారు.
రామసుబ్బారెడ్డి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవిని అదే వర్గానికి చెందిన శివనాధ్ రెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. గత ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీటీ నాయుడికి భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలకు ప్రాధాన్యం ఇస్తానన్న మాటను నిలుపుకునేందుకే అశోక్ బాబుకు ఎమ్మెల్సీగా స్థానం కల్పించినట్టు సమాచారం.