Botsa Satyanarayana: గత్యంతరం లేకనే మోదీ ఈ పని చేశారు: బొత్స ఎద్దేవా
- బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి
- అందుకే రైల్వే జోన్ ను హడావుడిగా ప్రకటించారు
- మరింత ముందుగా ప్రకటిస్తే బాగుండేదన్న బొత్స
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతోనే గత్యంతరం లేక ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీపై కన్నేసి, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రకటించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. జోన్ ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన, ఇదే ప్రకటనను ఎన్నికల సమయంలో కాకుండా, మరింత ముందుగా ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
వాల్తేరు డివిజన్ ఇండియాలోనే అత్యధికంగా ఆదాయాన్ని తీసుకువచ్చే డివిజన్లలో ఒకటని, దాన్ని విభజించడం తమకు నచ్చలేదని అన్నారు. వాల్తేరు డివిజన్ ను అలాగే ఉంచేస్తే ప్రజలు మరింతగా హర్షించేవారని, అరకొరగా విశాఖ జోన్ ను ప్రకటించారని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ ఈపని చేసిందని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు.