India: మసూద్ అజర్‌పై నిషేధం విధించాల్సిందే: ఐరాస భద్రతా మండలిపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఒత్తిడి
- భద్రతా మండలిలోని మూడు సభ్యదేశాల తాజా ప్రతిపాదన
- మసూద్ ఆస్తులను ఫ్రీజ్ చేయాలని డిమాండ్
- ఎప్పటిలాగే స్పందించని చైనా
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్‌పై నిషేధం విధించాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. పలు దేశాలు భారత్‌కు అండగా ముందుకొస్తున్నాయి. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఇప్పటికే ప్రకటించిన అమెరికా తాజాగా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. మసూద్‌పై నిషేధం విధించాలని ఐరాస భద్రతా మండలిని ఈ మూడు సభ్య దేశాలు కోరాయి.
15 సభ్య దేశాల మండలిలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై తాజాగా స్పందించాయి. ఉప ఖండంలో ఉద్రిక్తతలకు కారణమైన మసూద్ అజర్‌ను నిషేధించాలని, అతడి ఆస్తులను ఫ్రీజ్ చేయాలని కోరాయి. తాజా ప్రతిపాదనపై ఐరాస భద్రతా మండలి పది పనిదినాలలో నిర్ణయాన్ని ప్రకటించనుంది. కాగా, మసూద్ అజర్‌ను మొదటి నుంచి వెనకేసుకొస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా సభ్య దేశాల ప్రతిపాదనపై ఇప్పటి వరకు స్పందించలేదు.